కట్టె కాలాల్నంటే 60 వేలు

కట్టె కాలాల్నంటే 60 వేలు
  • కరోనా మృతుల అంత్యక్రియల్లో అడ్డగోలు దోపిడీ
  • హాస్పిటల్ నుంచి శ్మశాన వాటిక వరకు పైసలు గుంజుడే
  • మార్చురీలో శవాన్ని అప్పగించాలంటే రూ. 5 వేలు
  • అంబులెన్సులో శ్మశానానికి తీసుకెళ్లాలంటే రూ. 25 వేలు 
  • దహన సంస్కారాలకు ఇంకో రూ. 25 వేలు
  • పైసలు కట్టకపోతే అగ్గి ముట్టరు.. ఎక్కడికక్కడ వదిలేసుడే
  • చనిపోతే శ్మశానానికి ఫ్రీగా తరలిస్తామన్న సర్కారు హామీ గాలికి

కరోనాతో ఎవరైనా చనిపోతే వాళ్ల బంధువుల పరిస్థితి ‘చచ్చి బతికినంత’ పనైతోంది. తమ ఆప్తులు ఎలాగైనా కోలుకోవాలని అప్పటికే రూ. లక్షల్లో ఖర్చు చేసిన కుటుంబాలకు చావు కూడా భారంగా మారుతోంది. తమ వాళ్ల చావు చేసేందుకూ భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అప్పటికే ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉన్న కుటుంబీకులకు శ్మశానాల్లో ఎదురవుతున్న పరిస్థితి అంతులేని ఆవేదనను మిగులుస్తోంది. పైసా ఖర్చు లేకుండా కరోనా ట్రీట్ మెంట్ అని, చనిపోతే ఫ్రీగా శవాలను తరలించి దహన సంస్కారాలు చేయిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు గాలి మూటలవుతున్నాయి. కరోనా నోడల్ సెంటర్ గాంధీ ఆసుపత్రికి గానీ, పేషెంట్లను తరలించే శ్మశానాలను గానీ విజిట్ చేస్తే అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని శ్మశాన వాటికల్లో సాధారణ రోజుల్లో 50 నుంచి 60 వరకు శవాలు దహనం చేస్తుంటారు. ప్రస్తుతం రోజూ 200 వరకు శవాలు దహనం అవుతున్నాయి. సిటీలోని కొన్ని ముఖ్యమైన శ్మశాన వాటికల్లో దహనాలను చూస్తే ఈ విషయం నిజమేనని తేలుస్తుంది. సనత్నగర్ (ఈఎస్ఐ), బన్సిలాల్ట పే, అంబర్ పేట (గోల్నాక), పురానాపూల్ లాంటి కొన్ని శ్మశాన వాటికలను చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. గాంధీ మార్చురీ దగ్గరకు ఎప్పుడు పోయినా పదుల సంఖ్యలో శవాలు ఉంటున్నాయి. ప్లేస్ సరిపోక నాలుగో అంతస్తులోనూ శవాలను భద్రపరిచినట్లు తెలిసింది. ఈ శవాలను తీసుకుపోయి దహనం చేయడానికి ఎదురవుతున్న ప్రహసనం చూస్తే గుండె తరుక్కుపోతోంది.

ఆస్పత్రి నుంచి శ్మశాన వాటిక వరకు పైసలు గుంజుడే

ఆప్తుల శవాన్ని తీసుకునేందుకు మార్చురీ దగ్గర బంధువులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. అక్కడ ఎంత ఎక్కువ మొత్తంలో ముట్టజెబితే అంత తొందరగా శవం చేతికి వస్తోంది. శవాల అప్పగించేందుకు రూ. 5 వేలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. అంత స్థోమత లేదని బతిమిలాడితే రూ. 3 వేలు తీసుకుంటున్నారు. శవాన్ని తీసుకున్న బంధువులు శ్మశాన వాటికకు తరలించడానికి అంబులెన్సుల దగ్గరకు వెళ్తేరూ. వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. రూ. 25 వేల నుంచి బేరం మొదలుపెడుతున్నారు. డ్రైవర్లు సిండికేట్ అయి ఎవర్ని అడిగినా ఒకే రేటు చెబుతున్నారు. తక్కువలో తక్కువ రూ. 15 వేలు లేనిదే రావట్లేదు. జిల్లాలకు శవాల్ని తరలించాల్సి వస్తే ఇంకెంత డిమాండ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పైగా జిల్లాల నుంచి వచ్చే అంబులెన్సులను శవాల తరలించేందుకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక గాంధీ నుంచి శ్మశాన వాటికకు వెళ్లాక అక్కడ దహనానికి రూ. 25 వేలు డిమాండ్ చేస్తున్నారు. ఎంత బేరమాడినా రూ. 22 వేలకు తక్కువ చార్జ్ చేయట్లేదని మృతుల బంధువులు చెబుతున్నారు. సగటున ఒక శవ దహనానికి రూ. 40 నుంచి రూ. 60 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. 

10 సర్కారు అంబులెన్సుల్లో 6 పని చేయట్లే  

కరోనా డెడ్ బాడీలను ఫ్రీగా తరలిస్తామని సర్కారు చెప్పినా అమలు కావట్లేదు. డెడ్ బాడీల తరలింపుకు ప్రభుత్వం 10 అంబులెన్సులు ఇస్తే అందులో 6 పని చేయట్లేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 4 ఎక్కడుంటాయో ఎవరికీ అర్థం కాదు. ఫ్రీ అంబులెన్సుల ద్వారా కూడా పైసలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అడిగినంత ఇవ్వకపోతే శవాల్ని తరలించేందుకు డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. దీంతో శవాల తరలింపుకు గంటల కొద్ది సమయం పడుతోంది. శ్మశానాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ మధ్య ఈఎస్ఐ శ్మశాన వాటికలో పాడెపై పడుకోబెట్టిన శవాన్ని దహనం చేయడానికి 4 గంటల టైమ్ పట్టింది. తాము అడిగినంత ఇవ్వలేమని బంధువులు వాపోతే ఇవ్వాల్సిందేనంటూ శవాన్ని దహనం చేయలేదని తెలిసింది. దీంతో బంధువులు అటూ ఇటూ పరిగెత్తి డబ్బులు తీసుకొచ్చాక శవాన్ని దహనం చేశారు. ప్రైవేటు హాస్పిటళ్లు కూడా కరోనా మృతులను తరలించేందుకు అంబులెన్సుకు రూ.15 వేల నుంచి రూ. 20 వేలు వసూలు చేస్తున్నాయి.